ప్రపంచంలోని అతి ఎత్తైన పర్వతాలను అధిరోహించిన పర్వతారోహకుడు విశ్వనాథ్‌ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ సాధించిన విజయాలను ఎమ్మెల్యే ప్రశంసించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ, కేవలం 16 ఏళ్ల అతి చిన్న వయస్సులోనే ఏడు ఖండాల్లోని అత్యంత ఎత్తైన ఏడు పర్వత శిఖరాలను అధిరోహించడం ఎంతో అరుదైన ఘనతగా పేర్కొన్నారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా 20కు పైగా పర్వతాలను అధిరోహించి నాలుగు ప్రపంచ రికార్డులు సాధించడం అత్యంత అభినందనీయమన్నారు.
రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకున్న విశ్వనాథ్ కూకట్‌పల్లికి వాసి కావడం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని ఎమ్మెల్యే తెలిపారు. ఇటువంటి విజయాలు రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకొస్తాయని అన్నారు.
యువతకు విశ్వనాథ్ స్ఫూర్తిదాయకుడని పేర్కొన్న ఎమ్మెల్యే, కష్టపడి లక్ష్యాన్ని సాధిస్తే అసాధ్యం అనేదే లేదని ఆయన విజయాలు చాటిచెబుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు, ముద్దం నర్సింగరావు, దారం సతీష్ గుప్తా, విశ్వనాథ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.









