పెద్దవూర మండలం పోతునూరు గ్రామ శివారులోని హైదరాబాద్–సాగర్ ప్రధాన రహదారి వెంట ఉన్న సర్వే నంబర్ 290లో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేసీఆర్ హయాంలో 58 మంది దళిత పేదలకు పార్టీలకతీతంగా ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఆ స్థలాల్లో బాధితులు గుడిసెలు నిర్మించుకుని నివసిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.
అయితే పట్టపగలు, అందరూ చూస్తుండగానే కాంగ్రెస్ నాయకులు దళితుల గుడిసెలకు నిప్పు పెట్టారని బాధితులు తీవ్రంగా ఆరోపించారు. ఈ ఘటనలో పలువురు దళిత కుటుంబాలు ఆస్తి నష్టానికి గురై తీవ్ర ఆవేదనకు లోనయ్యాయి. తమకు అన్యాయం జరిగిందని బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు.
ఈ ఘటనపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ బాధితులను వెంటబెట్టుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. గుడిసెలకు నిప్పుపెట్టిన కాంగ్రెస్ కార్యకర్తలపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దళితులపై జరుగుతున్న దాడులను సహించేది లేదని స్పష్టం చేశారు.
గతంలో ఇండ్ల పట్టాలు ఇచ్చిన సమయంలో పనిచేసిన అధికారులే నేటికీ కొనసాగుతున్నప్పటికీ, ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులకు తొత్తులుగా వ్యవహరించడం తీవ్రంగా ఖండనీయమని నోముల భగత్‌కుమార్ విమర్శించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల అరాచకాలు మితిమీరుతున్నాయని, బాధితులకు న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, బాధితులు పాల్గొన్నారు.









