ఎండిఎంఏ, ఓపీఎం డ్రగ్స్‌ను పాన్ మసాలలో కలిపి మత్తులో ఉండే విధంగా విక్రయిస్తున్న నిందితుడిపై ఈగల్ అధికారులు నెల రోజుల పాటు నిఘా వేశారు. పూర్తి ఆధారాలను సేకరించిన తర్వాత బుధవారం అతనిని పేట్ బషీరాబాద్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద రూ.15 లక్షల విలువ చేసే ఎండిఎంఏ, ఓపీఎం డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
ఈగల్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, రాజస్థాన్‌కు చెందిన రాజేందర్ హైదరాబాద్‌లో ఇంటీరియర్ డిజైన్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. అతనికి ఎండిఎంఏ, ఓపీఎం డ్రగ్స్ పాన్ మసాలలో కలిపి మత్తులో ఉండే అలవాటు ఉండటంతో, ఇతర వలస కార్మికులు మరియు వ్యాపారస్తుల మధ్య కూడా డ్రగ్స్ వినియోగం ఉన్న విషయం తెలుసుకున్నాడు.
రాజేందర్ ఫుల్ డిమాండ్ ఉన్నందున ఈ డ్రగ్స్ దందా చేయాలని నిర్ణయించుకున్నాడు. సొంత ఊరికి వెళ్ళినప్పుడు తన స్నేహితులైన అనిల్ మోహన్ రాం, ధన్ రాజ్, ముఖేష్ జాట్, పున్నారాం బిష్ణోయ్‌ల నుండి తక్కువ ధరకు డ్రగ్స్ తెచ్చి నగరంలోని గ్రాము 5 వేలకు విక్రయిస్తున్నాడు.
అయితే ఈగల్ అధికారులు దాదాపు 30 రోజుల పాటు నిఘా వేశి బుధవారం అతన్ని అరెస్ట్ చేశారు. వీరి ద్వారా ఫుక్ రాజ్, బొమ్మ రాం, విజేందర్, బబ్లూ బిష్ణోయ్, హిమ్మత్ రాం, బాబులాల్, హితేష్, ఛతురాం, రాధాకృష్ణ వంటి వ్యక్తులు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారని గుర్తించారు. పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రత్యేక టీంలను కూడా ఏర్పాటు చేశారు.









