మూడు రోజుల క్రితం ప్రారంభమైన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర నేడు తల్లులు భక్తుల నుంచి వనంలోకి ప్రవేశించడంతో భక్తిశ్రద్ధల నడుమ ముగిసింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చింతల గట్టు వట్టి వాగు వద్ద నిర్వహించిన ఈ జాతరలో సుమారు ఆరు లక్షల మంది భక్తులు పాల్గొన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రెండు రోజుల పాటు గద్దెలపై కొలువుదీరిన తల్లులకు భక్తులు మొక్కులు చెల్లిస్తూ భక్తిభావంతో దర్శనం చేసుకున్నారు.
చుట్టూ పచ్చని వనం మధ్య తల్లులు కొలువుదీరిన ప్రదేశంలో భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి రెండు రోజుల పాటు ఆనందంగా గడిపారు. మూడు రోజులపాటు శివశక్తుల పూనకాలు, భక్తుల డోలు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలతో జాతర ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయింది. ఈ జాతర ఆదివాసీ గిరిజనుల సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచింది.
ఆదివాసీ గిరిజన పూజారులు తమ సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించి తల్లులను తిరిగి వనంలోకి చేర్చారు. గూడూరు మండలం మట్టేవాడలో సారలమ్మను, జాతరకు తూర్పు దిక్కున ఉన్న సూర్యుని గుట్టలో సమ్మక్కను, జగన్నాయకుల గూడెంలో పగిడిద్దరాజును వన ప్రవేశం చేశారు. దేవతలు వనంలోకి ప్రవేశించడంతో అధికారికంగా జాతర ముగిసింది.
శనివారం ఉదయం వరకు భక్తులతో కిక్కిరిసిన జాతర ప్రాంగణం దేవతల వన ప్రవేశంతో ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. ఈ జాతరలో గూడూరు తహసిల్దార్ నాగభవాని, డిప్యూటీ తహసీల్దార్ కోమల, గూడూరు సీఐ సూర్యప్రకాశ్, ఎస్సై గిరిధర్ రెడ్డి, అటవీ శాఖ అధికారి సురేష్ తదితరులు మూడు రోజుల పాటు పర్యవేక్షణ చేస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. జాతర కమిటీ మరియు పూజారుల సంఘం అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.









