గద్వాల రాజకీయాలపై మీనాక్షి నటరాజన్ హాట్ కామెంట్స్

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గద్వాల రాజకీయాలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అధికార పార్టీలో అభ్యర్థులకు బీ–ఫామ్‌ల జారీ ఆలస్యం కావడం వల్ల అంతర్గత విభేదాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో గద్వాల జిల్లాలోని రాజకీయ పరిస్థితులపై మీడియాలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ క్రమంలో అచ్చంపేట ప్రాంతంలో ఉపాధి హామీ పథకం అమలుపై పరిశీలనకు వచ్చిన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ బల్మూరు మండలం చెంచుగూడెం గ్రామంలో మీడియాతో మాట్లాడారు. గద్వాల రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితిపై మీడియా ప్రశ్నించగా ఆమె స్పష్టంగా స్పందించారు.

పార్టీలో ఎలాంటి వర్గబేధాలు లేవని, ఈ విషయానికి ఏఐసీసీకి సంబంధం లేదని మీనాక్షి నటరాజన్ తెలిపారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇస్తారని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆమె హాట్ కామెంట్స్ చేశారు.

జిల్లా పార్టీ అధ్యక్షుడు, స్థానిక నాయకుల సమన్వయంతో మున్సిపల్ ఎన్నికల్లో మంచి మెజార్టీతో విజయం సాధిస్తామని మీనాక్షి నటరాజన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల ప్రచారంలో వాస్తవం లేదని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. ఆమె వ్యాఖ్యలతో గద్వాల రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share