భారత క్రికెట్ జట్టులో సీనియర్ ఆటగాళ్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో 2027 ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌లో కూడా ఈ ఇద్దరూ ఆడాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అభిమానుల చర్చల మధ్య టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ స్పందిస్తూ వార్తల్లో నిలిచారు.
ఓ యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసిన వీడియోలో ధోనీ మాట్లాడుతూ.. ఒక ఆటగాడి విషయంలో వయస్సు అనేది కేవలం సంఖ్య మాత్రమేనని స్పష్టం చేశారు. ఫిట్నెస్, ప్రదర్శన బాగుంటే ఎంత వయస్సున్నా జట్టులో కొనసాగవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఇప్పటికీ అత్యుత్తమ స్థాయిలో ఆడుతున్నారని, అలాంటి ఆటగాళ్లను కేవలం వయస్సు కారణంగా పక్కన పెట్టకూడదని ధోనీ పరోక్షంగా మద్దతు తెలిపారు.
యూట్యూబ్ యాంకర్ ప్రశ్నకు స్పందిస్తూ ధోనీ.. “ఎవరైనా వచ్చే వరల్డ్ కప్ ఎందుకు ఆడకూడదు? నా దృష్టిలో వయస్సు అనేది ఒక క్రైటీరియానే కాదు. కేవలం ప్రదర్శన, ఫిట్నెస్ మాత్రమే ముఖ్యం” అని స్పష్టంగా చెప్పారు. ఒక ఆటగాడు జట్టుకు ఎంత ఉపయోగపడుతున్నాడు అనేదే అసలు ప్రమాణమని, వయస్సును ముందుకు తీసుకురావడం సరైంది కాదని ధోనీ అభిప్రాయపడ్డారు.
అనుభవం గురించి మాట్లాడుతూ.. జట్టులో 30 ఏళ్ల వయసు దాటిన ఆటగాళ్లు చాలా అవసరమని ధోనీ అన్నారు. కేవలం 20–25 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన వారిని అనుభవజ్ఞులుగా పరిగణించడం కష్టమని పేర్కొన్నారు. దేశం కోసం ఆడాలనే పట్టుదల, నిబద్ధత ఉంటే వారిని ఎవరూ అడ్డుకోకూడదని, అయితే ఫిట్నెస్ తగ్గితే మాత్రం జట్టులో కొనసాగించే ప్రశ్నే లేదని ధోనీ కుండబద్దలు కొట్టారు. ఈ వ్యాఖ్యలతో రోహిత్, విరాట్ల 2027 వరల్డ్ కప్ అవకాశాలపై అభిమానుల్లో కొత్త ఆశలు చిగురించాయి 🏏🔥









