మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి గుండు సున్నా

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి గుండు సున్నా తప్పదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ జోస్యం చెప్పారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మతం పేరుతో రెచ్చగొట్టిన బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదని గుర్తు చేశారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే పాత వ్యూహంతో మత రాజకీయాలు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి రాక కూడా అదే కుట్రలో భాగమేనని పేర్కొంటూ తెలంగాణ ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్, తెలంగాణ ప్రజలు మత వైషమ్యాలకు అతీతంగా సోదరభావంతో జీవించే వారని అన్నారు. అలాంటి ప్రజలు బీజేపీ మత రాజకీయాలను ఎప్పటికీ ఆదరించరని స్పష్టం చేశారు. భైంసా అల్లర్లను ఆసరాగా చేసుకుని గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ లబ్ధి పొందిందని ఆరోపించారు. కానీ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ప్రజలు అన్ని విషయాలను గమనించి ఓటు వేస్తారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, సంక్షేమం పేరుతోనే ప్రజల ముందుకు వెళ్తుందని మహేశ్ గౌడ్ చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే తమ బలమని పేర్కొన్నారు.
ఇక కేంద్రంలోని బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ బడ్జెట్‌లో తెలంగాణకు ఎంత ఇచ్చారో బీజేపీ అధ్యక్షుడు ముందుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటు చోరీ ద్వారానే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచారని ఆరోపించారు. రాష్ట్ర విభజన హామీల ప్రకారం తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు ఇవ్వకుండా కేంద్రం అన్యాయం చేస్తోందన్నారు. బయ్యారం స్టీల్ ప్లాంట్, జాతీయ హోదా కలిగిన నీటి ప్రాజెక్టులు, నవోదయ పాఠశాలలు, ఐఐఎమ్, ఆర్ఆర్ఆర్ రోడ్డు, మెట్రో, మూసీ ప్రాజెక్టు వంటి కీలక అంశాలను కేంద్రం విస్మరిస్తోందని దుయ్యబట్టారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share