భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌పై కేంద్రం కీలక ప్రకటన

భారత్–అమెరికా ట్రేడ్ డీల్‌పై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేసింది. లోక్‌సభలో మాట్లాడిన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఇరు దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంతో భారత్ పూర్తిగా సురక్షితంగా ఉందని స్పష్టం చేశారు. ఈ ఒప్పందం భారత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడిందని, దేశ ఆర్థిక భద్రతకు ఎలాంటి ముప్పు లేదన్నారు.
ఈ ట్రేడ్ డీల్ వల్ల ముఖ్యంగా మన రైతులకు పూర్తి రక్షణ లభిస్తుందని గోయల్ తెలిపారు. వ్యవసాయం, పాడి పరిశ్రమ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెగ్యులర్ టచ్‌లోనే ఉండి ఈ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. భారతీయ ఎగుమతులకు ఈ డీల్ ద్వారా భారీగా లాభం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు.
అయితే పీయూష్ గోయల్ ప్రసంగం సమయంలో లోక్‌సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. భారత్–అమెరికా ట్రేడ్ డీల్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, విపక్షాల ఆందోళన మధ్యే గోయల్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. సభలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ పరిణామాలపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలిపే విధానం ఇదేనా? సీనియర్ నేతలు, గతంలో ప్రభుత్వాన్ని నడిపిన వారు వ్యవహరించే తీరు ఇదేనా? అంటూ విపక్షాలను ప్రశ్నించారు. అయినప్పటికీ ఆందోళన కొనసాగడంతో సభను ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share