పవన్-హరీష్ శంకర్ కాంబో మళ్లీ రచ్చ

టాలీవుడ్ చరిత్రలో కొన్ని కాంబినేషన్లు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి జోడీల్లో పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ ఒకటి. వీరిద్దరి కలయికలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ప్రకటించినప్పటి నుంచే అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గతంలో గబ్బర్ సింగ్‌తో సంచలనం సృష్టించిన ఈ కాంబో మరోసారి మాస్ రచ్చ చేయబోతోందన్న నమ్మకం అభిమానుల్లో బలంగా ఉంది.
ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ మూవీ ‘తేరి’ ఆధారంగా రూపొందుతున్నప్పటికీ, దర్శకుడు హరీష్ శంకర్ తనదైన మాస్ ఎలివేషన్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో కథను పూర్తిగా మార్చేశారని సమాచారం. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా పొలిటికల్ పంచ్‌లు, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుండటంతో సినిమా విడుదలపై ఆసక్తి మరింత పెరిగింది.
మార్చి 26న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా, పలు కారణాల వల్ల వాయిదా పడిందన్న వార్తలు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే తాజా సమాచారం ప్రకారం, మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నిజానికి ఆ రోజున రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా విడుదల కావాల్సి ఉండగా, అది వాయిదా పడటంతో ఆ ఖాళీని పవన్ కళ్యాణ్ భర్తీ చేయబోతున్నారని తెలుస్తోంది.
ఇటీవల ఈ విషయంపై చిత్ర బృందం అధికారికంగా స్పందించి అభిమానులకు సాలిడ్ అప్‌డేట్ ఇచ్చింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సినిమా రిలీజ్ డేట్‌తో పాటు ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అభిమానులు సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని కూడా కోరారు. ఈ అప్‌డేట్‌తో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టించనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share