మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న లేటెస్ట్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘కొరియన్ కనకరాజు’పై మంచి అంచనాలు నెలకొన్నాయి. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్‌కు కీలకంగా మారనుందని అభిమానులు ఆశిస్తున్నారు. విభిన్నమైన కథ, కొత్త జానర్‌తో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతోందని టాక్.
ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ రీతికా నాయక్ హీరోయిన్గా నటిస్తుండగా, సీనియర్ నటి తులసి, కమెడియన్ సత్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు భారీ స్థాయిలో ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం.
ఈ సినిమాకు మ్యూజిక్ లెజెండ్ తమన్ సంగీతం అందిస్తున్నారు. వరుణ్ తేజ్ – తమన్ కాంబినేషన్లో వచ్చిన ‘తొలిప్రేమ’ అప్పట్లో మ్యూజికల్ సెన్సేషన్‌గా నిలవడంతో, ఇప్పుడు ఈ సినిమాపై కూడా భారీ హైప్ ఏర్పడింది. హారర్ కామెడీ జానర్‌కు తమన్ మ్యూజిక్ పెద్ద ప్లస్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రస్తుతం ‘కొరియన్ కనకరాజు’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, ఈ సమ్మర్లోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. గత కొంతకాలంగా వరుణ్ తేజ్ ఖాతాలో సరైన హిట్ లేకపోవడంతో, ఈ సినిమాతోనైనా గట్టి విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా, ఈ సినిమా పూర్తయ్యాక నిహారిక నిర్మాణంలో మరో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ద్వారా నిహారిక ఇప్పటికే వెబ్ సిరీస్‌లను నిర్మించిన విషయం తెలిసిందే.









