బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ మరోసారి నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి తన సినిమాల కారణంగా కాకుండా, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పుకార్ల వల్లే ఆమె వార్తల్లో నిలిచింది. టైగర్ ష్రాఫ్‌తో లాంగ్ రిలేషన్‌షిప్‌కు బ్రేక్ పడిన తర్వాత, దిశా పంజాబీ పాప్ సింగర్ తల్విందర్ సింగ్‌తో ప్రేమలో ఉందంటూ గత కొన్ని రోజులుగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.
కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ పెళ్లి వేడుకల్లో దిశా, తల్విందర్ జంటగా సందడి చేయడం ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చింది. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, దిశా కొత్త ప్రియుడు ఇతడేనంటూ నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. దీంతో ఈ జంటపై చర్చలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తల్విందర్ సింగ్ ఈ వార్తలపై ఘాటుగా స్పందించాడు. తమపై ఇంత త్వరగా అందరి దృష్టి పడుతుందని ఊహించలేదని, ఒకరినొకరు పరిచయమై కొద్ది కాలమే అవుతోందని తెలిపాడు. ప్రస్తుతం ఒకరి గురించి ఒకరం తెలుసుకునే దశలోనే ఉన్నామని, ఇలాంటి పుకార్ల వల్ల వచ్చే ఒత్తిడిని తాము కోరుకోవడం లేదని స్పష్టం చేశాడు. మా మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని, తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని కోరాడు.
అయితే ఇంటర్వ్యూ చివర్లో యాంకర్ అడిగిన ఓ ప్రశ్న ఈ వ్యవహారానికి మరో ట్విస్ట్ ఇచ్చింది. “మీకు ప్రేమపై నమ్మకం ఉందా?” అని అడగ్గా, “నేను ప్రతిరోజూ ప్రేమిస్తూనే ఉంటాను, ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నాను” అంటూ నవ్వుతూ బదులిచ్చాడు. దీంతో ఈ మాటలు దిశాను ఉద్దేశించేనా? అనే చర్చ మళ్లీ మొదలైంది. గతంలోనూ దిశా మోడల్ అలెగ్జాండర్ అలెక్సిక్‌తో సన్నిహితంగా కనిపించినప్పటికీ, అది కేవలం స్నేహమేనని తేలిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు తల్విందర్ విషయంలోనూ ఇదే జరుగుతుందా? లేక ఈ ఫ్రెండ్‌షిప్ ప్రేమగా మారుతుందా అన్నది కాలమే తేల్చాలి.









