788 మేడారం హుండీల లెక్కింపు.. భారీ ఆదాయం అంచనా

హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర హుండీల లెక్కింపు ప్రారంభమైంది. ఈ లెక్కింపును దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారికంగా ప్రారంభించారు. జాతర అనంతరం భక్తులు సమర్పించిన కానుకలను పారదర్శకంగా లెక్కించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఈ లెక్కింపును దేవాదాయ శాఖ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు కలిపి మొత్తం సుమారు 500 మంది నిర్వహిస్తున్నారు. మొత్తం 788 హుండీల్లో ఉన్న నగదు, బంగారం, వెండి ఇతర కానుకలను లెక్కించనున్నారు. భద్రత దృష్ట్యా పోలీసుల పర్యవేక్షణలో సీసీ కెమెరాల మధ్య ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
గత మేడారం జాతర సందర్భంగా 540 హుండీలు ఏర్పాటు చేయగా, వాటి ద్వారా సుమారు రూ.13.25 కోట్ల ఆదాయం లభించింది. ఈసారి హుండీల సంఖ్య పెరగడంతో పాటు భక్తుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటంతో ఆదాయం గతం కంటే మరింత అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
హుండీల లెక్కింపు ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం ప్రక్రియ సుమారు 10 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. మేడారం జాతర ఆదాయం దేవాలయ అభివృద్ధి, భక్తులకు మౌలిక వసతుల కల్పనకు వినియోగించనున్నట్లు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share