‘ఘూస్‌ఖోర్ పండిట్’పై బ్యాన్ డిమాండ్లు

సినిమా రంగంలో విభిన్నమైన పాత్రలు, సహజసిద్ధమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు మనోజ్ బాజ్‌పేయి నటిస్తున్న తాజా చిత్రం ‘ఘూస్‌ఖోర్ పండిట్’ విడుదలకు ముందే వివాదాల కేంద్రంగా మారింది. సినిమా కథకంటే ముందే దాని టైటిల్‌నే ప్రధాన సమస్యగా మారి, సోషల్ మీడియా నుంచి సంఘాల వరకు తీవ్ర చర్చలకు దారితీస్తోంది.
‘ఘూస్‌ఖోర్’ అనే పదానికి హిందీలో లంచగొండి, అవినీతిపరుడు అనే అర్థం ఉండగా, దానికి ‘పండిట్’ అనే పదాన్ని జోడించడం ద్వారా ఒక నిర్దిష్ట కులాన్ని అవమానించినట్టుగా ఉందని పలు బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. లంచగొండితనానికి ఒక వర్గాన్ని అనుసంధానించడం ఆ వర్గ ప్రతిష్ఠను దెబ్బతీస్తుందని వారు ఆరోపిస్తున్నారు.
ఈ సినిమా టైటిల్ బయటకు వచ్చినప్పటి నుంచే సోషల్ మీడియా వేదికగా నిరసనలు మొదలయ్యాయి. అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతూ, నెటిజన్లు మేకర్స్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. టైటిల్ వెంటనే మార్చకపోతే సినిమాను థియేటర్లలో విడుదల కాకుండా అడ్డుకుంటామని, అవసరమైతే న్యాయపోరాటానికి కూడా సిద్ధమని హెచ్చరిస్తున్నారు.
ఇలాంటి వివాదాలు గతంలో కూడా కొన్ని సినిమాల విషయంలో చోటుచేసుకున్నాయి. అప్పట్లో కొన్నింటికి టైటిల్ మార్పు తప్పనిసరి కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ఘూస్‌ఖోర్ పండిట్’ చిత్ర బృందం ఇప్పటివరకు అధికారికంగా స్పందించకపోయినా, వివాదం మరింత ముదిరితే పేరు మార్పు తప్పకపోవచ్చనే చర్చ నడుస్తోంది. మొత్తానికి మనోజ్ బాజ్‌పేయి తాజా సినిమా ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share