కమ్మర్పల్లి మండల కేంద్రానికి ఉప్లూర్, ఏర్గట్లతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నిత్యం పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. అయితే, కమ్మర్పల్లి, ఉప్లూర్ గ్రామాల్లోని కొన్ని చికెన్ సెంటర్ నిర్వాహకులు వ్యర్థాలను రహదారుల పక్కన, బహిరంగ ప్రదేశాల్లో నిర్లక్ష్యంగా పారవేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వ్యర్థాల నుంచి వచ్చే దుర్వాసనతో రహదారి గుండా ప్రయాణించడం కష్టంగా మారింది.
చికెన్ సెంటర్లలో మిగిలే వ్యర్థాలను గుట్టుచప్పుడు కాకుండా రాత్రి సమయాల్లో వాహనాల్లో తెచ్చి రోడ్ల పక్కన పడేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కుళ్లిపోయిన వ్యర్థాలు తీవ్రమైన దుర్గంధాన్ని వెదజల్లుతూ, పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, కాలినడకన వెళ్లేవారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
రోడ్డు ఇరువైపులా పడేసిన వ్యర్థాల వల్ల అక్కడికి పెద్ద ఎత్తున వీధి కుక్కలు చేరుతున్నాయి. అవి వ్యర్థాలను రోడ్డు మీదికి లాగడంతో వాహనదారులకు ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కుక్కల గుంపులు తిరగడం వల్ల కొందరిపై దాడులు జరిగి గాయాలైన ఘటనలూ నమోదయ్యాయి. కొంతమంది కుక్కలకు గజ్జి వంటి వ్యాధులు సోకడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
ఈ సమస్యపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. చికెన్ సెంటర్ నిర్వాహకులతో చర్చించి వ్యర్థాల నిర్వహణకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని, లేకపోతే పెద్ద ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.









