కందిబండలో యూరియా లేమితో రైతుల ఆగ్రహం

మేళ్లచెరువు మండలం కందిబండ గ్రామంలో యూరియా కొరత రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పంటలకు కీలకమైన ఈ ఎరువు సకాలంలో అందకపోవడంతో రైతులు రోడ్డెక్కారు. కోదాడ–మేళ్లచెరువు ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆన్‌లైన్‌లో యూరియా స్టాక్ కేవలం మూడు నిమిషాల పాటు మాత్రమే చూపించి ఆ వెంటనే మాయమవుతోందని రైతులు ఆరోపించారు. బుకింగ్ చేసినప్పటికీ ఎరువు తమకు అందడం లేదని, అధికారులు, డీలర్ల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కారణంగా పంటలు యూరియా లేక ఎర్రబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల ఆందోళన నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులను వివరణ కోరగా, ఆన్‌లైన్ విధానం కారణంగా ఇతర మండలాల నుంచి వచ్చిన రైతులు యూరియాను తీసుకెళ్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితి వల్ల స్థానిక రైతులకు అవసరమైన సమయంలో సరఫరా చేయలేకపోతున్నామని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ సమాధానంతో రైతులు పూర్తిగా సంతృప్తి చెందలేదు.
స్థానిక రైతులకు ప్రాధాన్యం ఇవ్వకుండా యూరియా పంపిణీ జరుగుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంటల కీలక దశలో ఎరువుల కొరత తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణ చర్యలు తీసుకొని యూరియా సరఫరా సవ్యంగా జరిగేలా చూడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share