ఓటీటీలో క్రైమ్ డ్రామాలకు చిరునామాగా నిలిచిన ‘మిర్జాపూర్’ ఇప్పుడు వెండితెరపై ప్రేక్షకులను షేక్ చేయడానికి సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మూడు సీజన్ల పాటు నెత్తురు, పగ, ప్రతీకారాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ సిరీస్, ఇప్పుడు ‘మిర్జాపూర్: ది ఫిల్మ్’గా బిగ్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో ఫ్యాన్స్‌లో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ చిత్రానికి సంబంధించిన అతిపెద్ద సర్ప్రైజ్ ఏంటంటే.. మున్నా భయ్యా పాత్ర పునరాగమనం. వెబ్ సిరీస్ రెండో సీజన్లో చనిపోయినట్లు చూపించిన ఈ క్యారెక్టర్, సినిమాలో మళ్లీ కనిపించనుండటంతో అంచనాలు రెట్టింపయ్యాయి. “అమర్ హై హమ్” అనే డైలాగ్‌ను నిజం చేస్తూ మున్నా భయ్యా థియేటర్లలో ఎంట్రీ ఇస్తే, విజిల్స్ గ్యారెంటీ అని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు కాలీన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి, గుడ్డూ పండిట్‌గా అలీ ఫజల్ మరోసారి ముఖాముఖి తలపడనున్నారు.
ఓటీటీ సిరీస్‌తో పోలిస్తే ఈ సినిమాలో యాక్షన్ మరింత భారీగా ఉండబోతోందని దర్శకుడు గుర్మీత్ సింగ్ హామీ ఇచ్చారు. పది రెట్లు ఎక్కువ యాక్షన్, వంద రెట్లు ఎక్కువ మాస్ రచ్చ ఉంటుందని తెలిపారు. అంతేకాదు, ‘పంచాయతీ’ ఫేమ్ జితేంద్ర కుమార్, సీనియర్ నటుడు రవి కిషన్ ఈ మిర్జాపూర్ యూనివర్స్‌లోకి రావడం కథకు మరింత బలాన్ని చేకూర్చింది.
ఈ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కృష్ణాష్టమి సెలవుల నేపథ్యంలో రిలీజ్ చేయడం ద్వారా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో ఇప్పటికే భారీ క్రేజ్ నెలకొంది. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలోకి రానుండటంతో, ఈసారి మిర్జాపూర్ అసలు మజాను థియేటర్లలోనే అనుభవించాల్సిందేనని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.









