తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. నాలుగు వారాల్లో పూర్తి స్థాయి డీజీపీ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని యూపీఎస్సీ, తెలంగాణ ప్రభుత్వాన్ని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఆదేశించింది. గత ఏప్రిల్‌లో తెలంగాణ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవాలని కూడా స్పష్టం చేసింది. ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
విచారణ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశాన్ని సింగిల్ జడ్జి బెంచ్ ముందు ఎందుకు లిస్ట్ చేశారంటూ ప్రశ్నించారు. సింగిల్ జడ్జి ఆదేశాల్లో ఎలాంటి తప్పు లేదని పేర్కొన్న ఆయన, అయితే సాధారణంగా ఇలాంటి కీలక వ్యవహారాలను సీనియర్ జడ్జి విచారిస్తారని తాము ఆశిస్తామని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఈ వివాదానికి కారణం గతేడాది సెప్టెంబరు 26న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో. ఆ జీవో ద్వారా బి. శివధర్ రెడ్డికి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ నియామకం సుప్రీంకోర్టు ‘ప్రకాశ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధమని పేర్కొంటూ హైదరాబాద్‌కు చెందిన టీ. ధనగోపాలరావు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, శివధర్ రెడ్డి నియామకానికి సంబంధించిన జీవోను కొట్టివేయడానికి నిరాకరించింది. అయితే పూర్తి స్థాయి డీజీపీ ఎంపిక ప్రక్రియను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఇప్పుడు హైకోర్టు తీర్పును సమర్థిస్తూ నాలుగు వారాల్లో డీజీపీ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు తుది ఆదేశాలు జారీ చేసింది.









