శంకరపట్నం మండలంలోని పలు గ్రామాల్లో అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎస్సారెస్పీ ప్రధాన కాలువకు అమర్చుకున్న వ్యవసాయ పంప్ సెట్లు వరుసగా చోరీలకు గురవుతున్నాయి. ఆదివారం నుంచి గురువారం వరకు ఈ చోరీల పరంపర నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. ప్రతి పసల్ కాలువల వద్ద రైతులు అమర్చుకున్న మోటార్లను దొంగలు ఎత్తుకెళ్లడంతో రైతులు భారీ నష్టాన్ని చవిచూస్తున్నారు.
వరుస దొంగతనాలపై రైతులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఫిర్యాదులు స్వీకరించడం తప్ప దొంగతనాలను అరికట్టే చర్యలు తీసుకోవడం లేదని గ్రామాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పోలీస్ గస్తీ లేకపోవడమే దొంగలకు అవకాశంగా మారుతోందని రైతులు అంటున్నారు.
కరీంపేట గ్రామానికి చెందిన గోపి రాజమల్లు, పాలేటి చిన్న కనకయ్య, పాలేటి బిక్షపతి, ఏగుర్ల తిరుపతి, పాలేటి వెంకయ్యలకు చెందిన మోటార్లు గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. గురువారం ఉదయం మోటార్ల వద్దకు చేరుకుని పరిశీలించగా అవి కనిపించకపోవడంతో లబోదిబోమన్నారు. బుధవారం అర్ధరాత్రి ఈ చోరీ జరిగినట్లు అనుమానిస్తున్నారు.
ఎత్తుకెళ్లిన మోటార్ల విలువ దాదాపు లక్ష రూపాయల వరకు ఉంటుందని రైతులు తెలిపారు. పోలీసులు వెంటనే గస్తీ పెంచి చోరీలను నివారించకపోతే వ్యవసాయం చేయలేని పరిస్థితి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చోరీ జరిగిన ప్రాంతానికి ఏఎస్ఐ సంపత్ రెడ్డి చేరుకొని రైతుల వివరాలను నమోదు చేసుకున్నట్లు సమాచారం.









