పార్లమెంట్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని సమాధానం ఇచ్చిన అనంతరం ఆమోదం పొందడం సాధారణ ప్రక్రియ. కానీ ఈసారి ఆ సంప్రదాయానికి విరుద్ధంగా, ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లేకుండానే లోక్‌సభలో ధన్యవాద తీర్మానం ఆమోదం పొందింది. 2004 తర్వాత తొలిసారిగా ఇలాంటి ఘటన జరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆరోపిస్తూ ఇండియా (INDIA) కూటమి ఎంపీలు సభలో తీవ్ర నిరసనకు దిగారు. నినాదాలు చేస్తూ సభను అడ్డుకున్న విపక్షాల కారణంగా సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజాస్వామ్య పద్ధతులను ప్రభుత్వం కాలరాస్తోందని విపక్షాలు ఆరోపించాయి.
2020 చైనా సరిహద్దు ఉద్రిక్తతలకు సంబంధించి మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణే రాసిన పుస్తకంలోని అంశాలను ప్రస్తావించేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నించగా, అందుకు అనుమతి ఇవ్వలేదని విపక్షాలు పేర్కొన్నాయి. ఈ అంశమే నిరసనలకు దారి తీసిందని ప్రతిపక్ష నేతలు స్పష్టం చేశారు.
బుధవారం ప్రధాని మోదీ సభలో మాట్లాడాల్సి ఉండగా, విపక్షాల ఆందోళనలతో సభ వాయిదా పడింది. ఇవాళ కూడా సభ ప్రారంభమైన కొద్దిసేపటికే నిరసనలు కొనసాగడంతో, స్పీకర్ ఓం బిర్లా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఆమోదించబడినట్లు ప్రకటించి సభను వాయిదా వేశారు. ఈ పరిణామం పార్లమెంటరీ చరిత్రలో అరుదైన ఘటనగా నిలిచింది.









