సైబర్ నేరాల నియంత్రణ, కట్టడే లక్ష్యంగా హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ‘షీల్డ్ 2.0’ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి హాజరయ్యారు. “బాధితులకు రక్షణ – డిజిటల్ భవిష్యత్తుకు భద్రత” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ సదస్సులో భాగంగా సైబర్ సారథి పోస్టర్‌ను సీఎస్, డీజీపీ సంయుక్తంగా ఆవిష్కరించారు. సైబర్ రంగంలో వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా ఈ సదస్సు రూపకల్పన చేశారు. ‘షీల్డ్ 2025’ సాధించిన విజయాలు, ‘షీల్డ్ 2026’ లక్ష్యాలకు సంబంధించిన ప్రత్యేక వీడియోను కూడా ఈ సందర్భంగా ప్రదర్శించారు. సైబర్ భద్రతలో టెక్నాలజీ పాత్ర మరింత కీలకమవుతోందని అధికారులు పేర్కొన్నారు.
ఈ సదస్సులో ఏఐ ఆధారిత పోలీస్ వ్యవస్థపై ప్రత్యేక చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల్లో తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన ఐపీఎస్ అధికారులు పాల్గొని తమ అనుభవాలను పంచుకోనున్నారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు, విద్యావేత్తలు, దేశవ్యాప్తంగా ఉన్న సైబర్ భద్రతా నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదే సమయంలో ‘షీల్డ్ 2025’ ప్రభావంతో చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (CPU)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించినట్లు పోలీసు శాఖ వెల్లడించింది. CPU ఏర్పాటు తర్వాత ఆన్‌లైన్ చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్‌పై గట్టి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గతంలో 37 కేసుల్లో 36 అరెస్టులు జరగగా, CPU ప్రారంభం తర్వాత 866 కేసులు నమోదు చేసి 421 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఇది సాంకేతికత ఆధారంగా మరింత సమర్థవంతమైన పోలీసింగ్‌కు నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు.









