సినిమాల్లో ఎక్కువగా విలన్ పాత్రలతో కనిపించే నటుడు సాయాజీ షిండే, నిజ జీవితంలో మాత్రం ఎంతటి సున్నిత మనస్కుడో మరోసారి నిరూపించుకున్నారు. తెరపై కఠినమైన పాత్రలు పోషించినా, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆయన ప్రకృతి ప్రేమికుడిగా, మానవత్వానికి ప్రతిరూపంగా నిలుస్తున్నారు. తాజాగా తన తల్లి మరణం తర్వాత ఆమె జ్ఞాపకాలను చిరకాలం నిలిపేలా ఆయన చేసిన పని ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
సాధారణంగా తల్లిదండ్రులు మరణిస్తే విగ్రహాలు, సమాధులు నిర్మించడం ఆనవాయితీ. కానీ సాయాజీ షిండే మాత్రం ఈ సంప్రదాయానికి భిన్నంగా ఆలోచించారు. ప్రకృతిని అమితంగా ప్రేమించిన తన తల్లి జ్ఞాపకార్థంగా మహారాష్ట్రలోని తన స్వగ్రామంలో ఏకంగా 5000 మొక్కలు నాటి, ఒక చిన్న అడవినే సృష్టించారు. ‘సహ్యాద్రి దేవ్రాయ్’ పేరుతో ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ ద్వారా లక్షలాది మొక్కలను నాటుతూ పర్యావరణ పరిరక్షణకు తన వంతు కృషి చేస్తున్నారు.
ఈ సందర్భంగా సాయాజీ షిండే భావోద్వేగంగా స్పందించారు. “మా అమ్మ ప్రకృతిని ఎంతో ప్రేమించేది. ఆమె చనిపోయినప్పుడు కేవలం ఫోటోకో, విగ్రహానికో పరిమితం చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆమె పేరు మీద నాటిన ప్రతి మొక్కలోనూ మా అమ్మను చూస్తున్నాను. ఈ మొక్కలు పెరిగి గాలి, నీడ ఇస్తున్నప్పుడు… ఆమె ఆశీస్సులు అందరికీ అందుతున్నాయని భావిస్తున్నాను” అంటూ ఆయన చెప్పిన మాటలు అందరినీ కదిలించాయి.
సాయాజీ షిండే ఈ పని కేవలం తన తల్లి కోసమే కాదు, పర్యావరణం కోసం కూడా. ఖాళీ స్థలం కనిపిస్తే మొక్క నాటడం, అంతరించిపోతున్న అరుదైన చెట్ల జాతులను కాపాడటం ఆయన జీవన విధానంలో భాగమైంది. తాజాగా చేసిన ఈ గొప్ప ప్రయత్నాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, “సినిమాల్లో మీరు విలన్ కావచ్చు… కానీ నిజ జీవితంలో మాత్రం గ్రేట్ హీరో సర్” అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.









