తదుపరి దర్యాప్తుపై స్పష్టత కోరిన సుప్రీంకోర్టు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా? అవసరమైతే ఎవరి కస్టడీ కావాలో స్పష్టంగా తెలియజేయాలని సీబీఐని ప్రశ్నించింది. జస్టిస్ ఎం.ఎం. సుందరేష్ ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపి స్పష్టమైన దిశానిర్దేశాలు చేసింది.
వివేకా హత్య కేసుకు సంబంధించి ట్రయల్ కోర్టు ఇప్పటికే ఇచ్చిన ఆదేశాలను కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు విషయంలో ఎలాంటి గందరగోళం లేకుండా ట్రయల్ కోర్టు ఉత్తర్వుల ప్రకారమే యథాతథంగా ముందుకు వెళ్లాలని తెలిపింది. తదుపరి దర్యాప్తు అవసరం ఉందని భావిస్తే, అందుకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని పేర్కొంది.
ఈ కేసులో నెల రోజులలో దర్యాప్తు పూర్తి చేయాలని గతంలో సీబీఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై కూడా సుప్రీంకోర్టు స్పందించింది. ఆ గడువును సవరించిన ధర్మాసనం, “నిర్దిష్ట కాలపరిమితి కన్నా దర్యాప్తు నాణ్యత ముఖ్యం” అన్నట్లు సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ అంశం ఇప్పటికే ట్రయల్ కోర్టు ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉందని వ్యాఖ్యానించింది.
మొత్తానికి, వివేకానందరెడ్డి హత్య కేసులో మరింత దర్యాప్తు జరగాలా? ఎవరి పాత్రపై లోతైన విచారణ అవసరమో నిర్ణయించాల్సిన బాధ్యతను సీబీఐపైనే సుప్రీంకోర్టు ఉంచింది. ఈ ఆదేశాలతో ఈ కేసులో మరో కీలక మలుపు తిరిగినట్టుగా న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share