116 పాటలతో గోల్డెన్ స్టార్ రికార్డు ప్రయత్నం

వియంయన్ (వంజా మాలతి నాయుడు) కల్చరల్ అసోసియేషన్ – ఖమ్మం ఆధ్వర్యంలో ఈనెల 12న సుదీర్ఘ గాన వాహిని కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు, అంతర్జాతీయ అవార్డు గ్రహీత వంజా మాలతి నాయుడు వెల్లడించారు. తొలుత ఈ మెగా ఈవెంట్‌ను ఖమ్మంలో నిర్వహించాలని భావించినప్పటికీ, అనివార్య కారణాల వల్ల వేదికను హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని సరెగ మ్యూజికల్ స్టూడియోకు మార్చినట్లు తెలిపారు.
వేదిక మారినప్పటికీ ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి గాయనీ గాయకుల నుంచి అనూహ్యమైన స్పందన లభించిందని వంజా మాలతి నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కళాకారులు భాగస్వాములు కావడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. సంగీతంపై ఉన్న ప్రేమ, రికార్డు సాధనపై ఉన్న ఆసక్తి ఈ స్పందనకు ప్రధాన కారణమని ఆమె పేర్కొన్నారు.
ఈ సుదీర్ఘ గాన వాహినిలో మొత్తం 116 మంది గాయనీ గాయకులు పాల్గొని 116 సినిమా పాటలను ఆలపించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా గోల్డెన్ స్టార్ అవార్డ్స్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. గాయనీ గాయకులందరూ తనతో కలిసి వేదికపై పాటలు పాడటం ఈ ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని ఆమె చెప్పారు.
ఇప్పటివరకు ఉన్న గాన వాహిని రికార్డును అధిగమించేలా ఈ కార్యక్రమం సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన వంజా మాలతి నాయుడు, ఇది కేవలం రికార్డు సాధనకే కాకుండా తెలుగు సంగీతానికి ఒక ఘనమైన వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. సంగీత ప్రేమికులకు ఈ కార్యక్రమం మరపురాని అనుభూతిని అందించనుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share