భారత్‌ను ముక్కలు చేస్తామన్న లష్కరే హెచ్చరిక

భారత్‌ను విచ్ఛిన్నం చేస్తామంటూ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా మరోసారి బహిరంగ హెచ్చరికలు జారీ చేసింది. లష్కరే తోయిబా అక్ర కమాండర్ సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్ నఖ్వీ కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం పేరుతో లాహోర్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ఈ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సభకు రాజకీయ నాయకులు కూడా హాజరుకావడం పాక్‌లో ఉగ్రవాదానికి ఉన్న ప్రత్యక్ష మద్దతును మరోసారి బహిర్గతం చేసింది.
సభలో ప్రసంగించిన నఖ్వీ.. ఢిల్లీ, ఆగ్రా వంటి కీలక నగరాలపై దాడులు చేస్తామని, కాశ్మీర్‌ను విముక్తి చేస్తామని బహిరంగంగా బెదిరించాడు. అఖండ భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా విడగొడతామని, దక్కన్ ప్రాంతాన్ని మండిస్తామని, ఢిల్లీని కదిలిస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు భారత భద్రతా వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
26/11 ముంబై ఉగ్రదాడిని ప్రస్తావించిన నఖ్వీ.. తమ పూర్వీకుల త్యాగాలు వృథా కాకూడదని వ్యాఖ్యానించడం మరింత కలకలం రేపింది. ఉగ్రవాద చర్యలను మహిమన్వితంగా చూపించేలా చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ ఉగ్రవాద నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉండగా, సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్ నఖ్వీ పాకిస్తాన్ మర్కాజీ ముస్లిం లీగ్‌కు నాయకత్వం వహిస్తున్నాడన్న అంశం మరింత ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లో అనేక ఉగ్రదాడులకు కారణమైన లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, అతని కుమారుడు హఫీజ్ తల్హా సయీద్‌కు నఖ్వీ అత్యంత సన్నిహితుడిగా భద్రతా వర్గాలు గుర్తించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎలా ప్రోత్సహిస్తోందో మరోసారి ప్రపంచానికి స్పష్టమవుతోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share