తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్లో భాగంగా రాష్ట్రంలో కాగిత రహిత (పేపర్‌లెస్) పాలన అందించేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ లక్డీకాపుల్‌లోని ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా డైరెక్టరేట్‌లో నూతనంగా ప్రవేశపెట్టిన ‘ఈ-ఆఫీస్’ అప్లికేషన్‌ను అధికారికంగా ప్రారంభించారు.
ఈ-ఆఫీస్ విధానం ద్వారా ఫైళ్ల సత్వర పరిష్కారం సాధ్యమవుతుందని, పరిపాలనలో జవాబుదారీతనం, పారదర్శకత మరింత పెరుగుతాయని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ విభాగంలో ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసిన డైరెక్టర్, సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. డిజిటల్ టెక్నాలజీని వినియోగంలోకి తీసుకురావడం ద్వారా ప్రభుత్వ సేవల నాణ్యత మెరుగవుతుందని అన్నారు.
అనంతరం ప్రాసిక్యూషన్ విభాగం కోసం రూపొందించిన ‘ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ నిర్వహణ వ్యవస్థ’ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ విధానం ద్వారా సిబ్బంది హాజరులో క్రమశిక్షణ పెరగడమే కాకుండా, మానవ జోక్యం తగ్గి పూర్తి పారదర్శకత సాధ్యమవుతుందని తెలిపారు. డిజిటల్ హాజరు విధానం ప్రభుత్వ కార్యాలయాల్లో మంచి మార్పుకు దారితీస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీవీ ఆనంద్ కీలక సూచనలు చేశారు. దేశంలో అమలులోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలపై ప్రత్యేకంగా చర్చించారు. వాటి అమలుకు సంబంధించి సర్క్యులర్లు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, ప్రభుత్వ ఉత్తర్వుల రూపకల్పనలో ప్రాసిక్యూటర్ల బృందం చేసిన కృషిని ప్రశంసించారు. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఎస్. సాంబశివ రెడ్డి విభాగం సాధించిన విజయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించగా, పెండింగ్ అంశాల పరిష్కారానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సానుకూలంగా స్పందించారు.









