నకిలీ బాబా ముఠా గుట్టురట్టు అయ్యింది. గుప్త నిధుల పేరుతో జరుగుతున్న భారీ మోసాలను పోలీసులు వెలికి తీశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. కేసు వివరాలను శుక్రవారం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. భీంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిప్పల్ కోటి గ్రామానికి చెందిన దర్శనాల రాజ్ కుమార్ ఈ మోసానికి ప్రధాన సూత్రధారి అని తెలిపారు.
పోలీసుల దర్యాప్తు ప్రకారం.. దర్శనాల రాజ్ కుమార్ గత మూడు సంవత్సరాలుగా తనకు దేవర (పూనకం) వస్తుందని, మంత్ర శక్తి ఉందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలను నమ్మించాడు. తమ కష్టాలు, సమస్యలు మంత్ర శక్తితో పరిష్కరిస్తానని చెప్పడంతో అనేక మంది అతని వద్దకు వచ్చి నమ్మకం పెట్టుకున్నారు. ఈ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని అతను బాధితులను మోసగించడం ప్రారంభించాడు.
అదే క్రమంలో కొంతమందికి తాను మంత్ర శక్తి ద్వారా బంగారం తవ్విస్తానని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేశాడు. తన బావ మహేందర్, మిత్రులు నవీన్, అరుణ్, శ్యామ్, అఖిల్, కిరణ్‌లతో కలిసి ప్లాన్ ప్రకారం బాధితుల ఇళ్ల వద్ద గుంతలు తవ్వించాడు. ముందుగానే ఫ్లిప్‌కార్ట్ కార్డ్ ద్వారా ఆర్డర్ చేసిన నకిలీ నాణేలను మట్టితో నిండిన కుండలో పెట్టి, తవ్వకంలో దొరికినట్లుగా నాటకం ఆడేవారు.
తర్వాత ఆ కుండను ఎర్ర బట్టతో చుట్టి 41 రోజులు ముట్టకుండా పూజలు చేయాలని చెప్పి, పూజ చేసిన బిందెను ఎవరైనా తాకితే చనిపోతారని భయపెట్టేవారు. ఈ విధంగా దర్శనాల రాజ్ కుమార్ తన ముఠాతో కలిసి మొత్తం 26 మంది వద్ద నుంచి రూ.1,03,80,000 వరకు వసూలు చేసి మోసగించినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు









