నీటిపారుదల శాఖలో కీలక నియామకాలు.. ఉత్తర్వులు జారీ

రాష్ట్ర నీటిపారుదల శాఖలో కీలక పరిపాలనా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంజినీర్ ఇన్ చీఫ్ (జనరల్)గా ఓవీ రమేశ్‌బాబుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇప్పటివరకు ఇంజినీర్ ఇన్ చీఫ్ (అడ్మిన్)గా విధులు నిర్వహిస్తున్న రమేశ్‌బాబుకు ఇప్పుడు ఈఎన్సీ (జనరల్) బాధ్యతలు కూడా అప్పగించారు.
మొన్నటివరకు ఈఎన్సీ (జనరల్)గా ఉన్న అమ్జద్ హుస్సేన్ గత నెల 31న ఉద్యోగ విరమణ చేయడంతో ఆ పదవి ఖాళీ అయింది. అప్పటి నుంచి వారం రోజుల పాటు ఈ పోస్టును భర్తీ చేయకపోవడంతో పాటు, కనీసం ఇన్‌చార్జి బాధ్యతలు కూడా ఎవరికీ అప్పగించలేదు. దీంతో శాఖలో పరిపాలనా స్థాయిలో అసంతృప్తి నెలకొన్నట్లు సమాచారం.
ఈ అంశంపై శుక్రవారం ‘దిశ’ పత్రికలో ‘ఈఎన్సీ.. వేకెన్సీ’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి ఓవీ రమేశ్‌బాబుకు ఈఎన్సీ (జనరల్)గా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో శాఖలో పరిపాలనా స్పష్టత వచ్చిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
అదేవిధంగా నారాయణపేటలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న కె. బ్రహ్మానంద్‌ను కొడంగల్ (ఐసీ-3, మక్తల్) పరిధిలోని ఐడీ-9 విభాగానికి ఎఫ్‌ఏసీపై నియమించారు. అలాగే కరీంనగర్‌లో ఓ/ఓ ఈఎన్సీలో డిప్యూటీ చీఫ్ ఇంజినీర్‌గా ఉన్న కె. రాధాకృష్ణకు ఐసీ-2, కరీంనగర్ పరిధిలో డిప్యూటీ సూపరింటెండింగ్ ఇంజినీర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share