జగన్ పాలన ఆటవిక రాజ్యమే- మంత్రి కొల్లు రవీంద్ర

ఆటవిక రాజ్యమంటే ఎలా ఉంటుందో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో ప్రజలకు చూపించారని మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, జగన్ పాలన అంతా హింస, విధ్వంసం, విద్వేషాలతో నిండిపోయిందన్నారు. అందుకే జగన్‌కు “జంగిల్‌రాజ్ అవార్డు” ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో పార్టీ కార్యాలయాలు, దేవాలయాలపై దాడులు చేయించారని ఆయన మండిపడ్డారు.
జగన్ పరామర్శల పేరుతో ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొడుతున్నారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. తాను వెళ్లే ప్రతి పరామర్శ వెనుక హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, ఆ విద్వేషాలకు మూలకారణం జగన్ తానేనని ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. సీఎం ను బూతులు తిట్టి, టీడీపీ నేతలను రెచ్చగొట్టి తన్నులు తిన్న వారిని పరామర్శించేందుకు జగన్ వెళ్లడం వెనుక కుట్రలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
ఇలాంటి పరామర్శల అనంతరం వ్యక్తులు చనిపోవడం, గ్రామాల్లో శాంతి భద్రతలు దెబ్బతినడం జరుగుతూనే ఉన్నాయన్నారు. తెనాలిలో బ్లేడ్ బ్యాచ్‌ను పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంలో కూడా హింసను ప్రోత్సహిస్తున్నామన్న సందేశమే జగన్ ఇచ్చారని విమర్శించారు. ఇలాంటి నాయకత్వం రాష్ట్రానికి ఎంత ప్రమాదకరమో ప్రజలు ఇప్పటికే గ్రహించారని అన్నారు.
ఈ కారణాల వల్లే వైసీపీ పార్టీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిందని కొల్లు రవీంద్ర గుర్తుచేశారు. ఒకప్పుడు 151 సీట్లు గెలిచిన పార్టీ, ఇప్పుడు కేవలం 11 స్థానాలకు పరిమితమైందన్నారు. ఇప్పటికైనా వైసీపీ తన తీరు మార్చుకోకపోతే రాజకీయంగా అథఃపాతాళానికి పడిపోవడం ఖాయమని ఆయన హెచ్చరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share