దేశ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. బీహార్‌లోని పూర్ణియా నియోజకవర్గ స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్‌ను పాట్నా పోలీసులు శనివారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. 1995 నాటి ఫోర్జరీ కేసులో కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో ఈ అరెస్ట్ జరిగింది. ఈ ఘటన బీహార్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
రాత్రి సుమారు 50 మంది పోలీసుల బృందం పాట్నాలోని మండిరి ప్రాంతంలో ఉన్న పప్పు యాదవ్ నివాసానికి చేరుకుంది. విషయం తెలుసుకున్న ఆయన మద్దతుదారులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, మద్దతుదారులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అదనపు బలగాలను మోహరించారు.
అరెస్ట్ సమయంలో పప్పు యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని, సాదాసీదా దుస్తుల్లో వచ్చిన ఓ అధికారి వద్ద ఆయుధం ఉందని ఆరోపించారు. తాను కోర్టును గౌరవిస్తానని, ఉదయం 11 గంటలకు తానే స్వయంగా కోర్టుకు హాజరవుతానని పోలీసులతో వాదించారు. అయినప్పటికీ పోలీసులు చట్టపరమైన ప్రక్రియలో భాగంగా అరెస్ట్ కొనసాగించారు.
చివరకు అర్ధరాత్రి దాటాక పప్పు యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల కోసం ఐజీఐఎంఎస్ (IGIMS) ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు పూర్తైన తర్వాత ఆయనను గర్దానీబాగ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఉంచారు. ఈ అరెస్ట్ నేపథ్యంలో బీహార్ రాజకీయాల్లో ఉద్రిక్తత నెలకొనగా, పప్పు యాదవ్‌పై తదుపరి న్యాయ ప్రక్రియపై ఆసక్తి నెలకొంది.









