ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నర్సు వలివేటి శుభావతి జాతీయ స్థాయిలో గౌరవనీయమైన ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును అందుకుని రాష్ట్రానికి గౌరవం తీసుకువచ్చారు. దేశవ్యాప్తంగా వైద్య సేవలకుగాను నర్సులకు ప్రతి సంవత్సరం ఇచ్చే ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా స్వీకరించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఈ పురస్కారాన్ని పొందారు.
ప్రస్తుతం కర్నూలు రీజినల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ట్రైనింగ్ సెంటర్‌లో ఏఎన్‌ఎగా పనిచేస్తున్న శుభావతి 29 ఏళ్ల పాటు అంకితభావంతో ప్రజలకు వైద్య సేవలు అందించారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు శిక్షణాధికారిగా పనిచేశారు. ఆమె స్వయంగా ఒక ఆరోగ్య గీతాన్ని రచించి, ఆలపించి ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంచే ప్రయత్నం చేయడం విశేషం.
ఈ అవార్డుతో పాటు శుభావతికి ప్రశంసాపత్రం మరియు లక్ష రూపాయల నగదు బహుమతి కూడా లభించాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మరియు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆమె సేవలను ప్రతి ఒక్కరూ ప్రశంసించారు.
ఈ సందర్భంలో మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా సేవలందిస్తున్న నర్సులందరూ ప్రశంసకు పాత్రులేనని అన్నారు. “ప్రతిరోజూ మన ప్రజల ఆరోగ్యం కోసం పోరాటం చేస్తున్న నర్సులే భారత ఆరోగ్య వ్యవస్థకు బలమైన మూలస్తంభాలు” అని కొనియాడారు. ఈ అవార్డులు వారికి చిన్న గుర్తింపేమీ కాదని, దేశం మొత్తం సెల్యూట్ చేస్తుందని అన్నారు.









