తిరుమల తిరుపతి దేవస్థానంలో (టీటీడీ) అన్యమతాలను అనుసరించే నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసిన విషయం పెద్ద చర్చనీయాంశంగా మారింది. విజిలెన్స్ విభాగం నివేదిక ఆధారంగా, ఈ ఉద్యోగులు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నట్టు నిర్ధారణ కావడంతో టీటీడీ పాలకమండలి వారు తక్షణమే సస్పెన్షన్‌కు పాల్పడ్డారు. ఈ చర్యపై భిన్న స్పందనలు వెలువడుతున్న వేళ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన బండి సంజయ్, ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. “ఇది మా డిమాండ్‌కు ఫలితంగా తీసుకున్న తొలి నిర్ణయం మాత్రమే. తిరుమలలో ఇంకా అనేక మంది హిందువేతరులు పని చేస్తున్నారు. అలాంటి పవిత్ర హిందూ క్షేత్రంలో ఇతర మతస్తులకు స్థానం ఉండకూడదు” అని పేర్కొన్నారు. ఇది హిందువుల నమ్మకానికి, ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయం అని వ్యాఖ్యానించారు.
బండి సంజయ్ తన వ్యాఖ్యల్లో టీటీడీలో సేవ చేస్తున్న మిగిలిన అన్యమత ఉద్యోగులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీటీడీ అనేది దేశంలోని అత్యంత పవిత్రమైన హిందూ క్షేత్రమైయినందున, అక్కడ సేవ చేయవలసిన వారు హిందూ మతాన్ని అనుసరించేవారే అయి ఉండాలన్నారు. దీనిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవాలని సూచించారు. తిరుమల పవిత్రతను కాపాడే బాధ్యత అందరిమీద ఉందని చెప్పారు.
టీటీడీ తీసుకున్న తాజా నిర్ణయం అనేక రాజకీయ పరిణామాలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఇది పెద్ద చర్చగా మారింది. కొన్ని వర్గాలు దీనికి మద్దతు తెలిపితే, మరికొన్ని వర్గాలు మతసామరస్యంపై ప్రభావం పడుతుందన్న ఆందోళనను వ్యక్తం చేశాయి. ఇక బండి సంజయ్ వ్యాఖ్యలు ఈ అంశంపై మరింత దృష్టి కేంద్రీకరించనున్నాయి.









