పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన అగ్ని ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడైన యశ్వంత్ ఫిర్యాదు మేరకు పరిశ్రమ యాజమాన్యంపై సిగాచి బీడీఎల్ భానూర్ పోలీసులు IPC 105, 110, 117 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంలో పలువురు మరణించగా, కొంతమంది గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనాస్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుతో కలిసి ప్రమాద స్థలాన్ని సందర్శించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు పలు మృతదేహాలను వెలికితీశామని, మరో 11 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు గాలింపు కొనసాగుతుందని వివరించారు. పొట్టకూటి కోసం వలస వచ్చిన కార్మికులు ఇలా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరమని అన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఉన్నతాధికారులతో కమిటీ వేయాలని కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు సరిగ్గా అమలవుతున్నాయో లేదో సమీక్ష అవసరమని, పరిశీలనలు కేవలం లంచాల కోసం చేయబడుతున్నాయన్న అనుమానం ఉందని వ్యాఖ్యానించారు. ఫార్మా పరిశ్రమలకు రా మ్యాటీరియల్ అందించే ఈ యూనిట్‌లో స్పష్టమైన భద్రతా లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రమాదానికి బాధ్యత వహించాల్సిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సిగాచి యాజమాన్యానికి చెందిన మిగతా మూడు పరిశ్రమల్లో కూడా తక్షణమే తనిఖీలు జరపాలని డిమాండ్ చేశారు. శిథిలాల కింద మృతదేహాలు ఉండే అవకాశం ఉన్నందున పోలీస్ డాగ్ స్క్వాడ్ ఉపయోగించాలని సూచించారు. పారిశ్రామిక ప్రాంతాల్లో అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచాలని, కేంద్రం తరఫున రాష్ట్రానికి అన్ని విధాల సహాయం అందిస్తామని, మృతుల కుటుంబాలను అండగా ఉంచుతామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.









