కుటుంబ పింఛనుదారులు, సూపర్ సీనియర్ పింఛనుదారుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జూలై 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు ‘స్పెషల్ క్యాంపెయిన్ 2.0’ పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రచారం సాగనుంది. ఇందులో భాగంగా 2210 పింఛను సంబంధిత ఫిర్యాదులను గుర్తించి, 51 మంత్రిత్వ శాఖలకు పంపినట్లు ఆయన వివరించారు.
ఈ కార్యక్రమం ద్వారా పెన్షనుదారుల సమస్యలను సమర్థవంతంగా, వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. గత 11 ఏళ్లలో పింఛన్ల శాఖ ఎంతో ప్రగతి సాధించిందని మంత్రి అన్నారు. పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ విభాగం (DOPPW) రోజువారీగా ఫిర్యాదులను పర్యవేక్షిస్తోందని, ఇప్పటివరకు 25% పైగా ఫిర్యాదులు పరిష్కారమయ్యాయని తెలిపారు. ఈ ప్రచారానికి సంబంధించిన విజయవంతమైన పరిష్కారాలను సోషల్ మీడియా వేదికలపై #SpecialCampaignFamilyPension2.0 హ్యాష్‌ట్యాగ్‌తో ప్రచారం చేయనున్నట్టు చెప్పారు.
పెన్షనుదారుల ఫిర్యాదులపై ముందస్తు ప్రణాళికలో భాగంగా, జూన్ 11న డీఓపీపీడబ్ల్యూ కార్యదర్శి నేతృత్వంలో నోడల్ అధికారులతో సమీక్షా సమావేశం కూడా నిర్వహించారట. మహిళా సాధికారత, వృద్ధుల సంక్షేమం పట్ల తమ ప్రభుత్వం ఎంతగా కట్టుబడి ఉందో ఈ చర్యలు చాటిచెప్పుతున్నాయని మంత్రి వివరించారు. ఇది పాలనా వ్యవస్థలో జవాబుదారీతనానికి, పారదర్శకతకు దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు.
ఇదే వారంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరొక శుభవార్త అందింది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) పరిధిలోకి వచ్చే ఉద్యోగులు ఇకపై పదవీ విరమణ, మరణ గ్రాట్యుటీకి అర్హులవుతారని జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ మార్పు ద్వారా న్యాయసమ్మతమైన సమానత్వాన్ని తీసుకువస్తున్నామని చెప్పారు. జాతీయ పింఛనుల వ్యవస్థ కింద సామాజిక భద్రత కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పానికి ఇది ఉదాహరణ అని ఆయన స్పష్టం చేశారు.









