చలనచిత్ర, టీవీ, నాటక రంగాల్లో విశేష సేవలు అందించిన కళాకారులకు ఇచ్చే ప్రతిష్టాత్మక నంది అవార్డులపై ఏపీ మంత్రి కండ్రుల దుర్గేష్ కీలక ప్రకటన చేశారు. నంది అవార్డుల నిర్వహణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలోనే ఈ అవార్డులను అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన మంత్రి, నంది అవార్డులపై తాజా అప్డేట్‌ను వెల్లడించారు.
2017లో అప్పటి ప్రభుత్వం 2014, 2015, 2016 సంవత్సరాలకు సంబంధించిన నంది అవార్డులను మాత్రమే అందించిందని, ఆ తర్వాత చాలా కాలంగా ఈ అవార్డులు నిలిచిపోయాయని మంత్రి గుర్తు చేశారు. గతంలో ఉన్న విధానాన్నే కొనసాగించాలా? లేక అవార్డుల వ్యవస్థలో ఏమైనా మార్పులు చేయాలా? అనే అంశాలపై పూర్తిస్థాయిలో చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఈ విషయంలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణతో పాటు సినీ రంగానికి చెందిన ఇతర ప్రముఖుల అభిప్రాయాలు, సూచనలు తీసుకుంటామని కండ్రుల దుర్గేష్ తెలిపారు. కళాకారులకు న్యాయం జరిగేలా, పారదర్శకంగా అవార్డుల విధానం ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
రెండు నుంచి మూడు నెలల్లోనే రాష్ట్రంలో నంది అవార్డుల వేడుకను ఘనంగా నిర్వహిస్తామని, అలాగే నంది నాటకోత్సవాలను కూడా నిర్వహించే యోచనలో ఉన్నామని మంత్రి వెల్లడించారు. త్వరలోనే అవార్డుల కార్యక్రమానికి సంబంధించిన వేదిక, ఇతర వివరాలను అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. అయితే ఈసారి గత తొమ్మిది సంవత్సరాల్లో వచ్చిన సినిమాలు, నటీనటులకు అవార్డులు ఎలా అందిస్తారన్న అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని పేర్కొన్నారు.









