ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు కర్నూలు జిల్లాలో పర్యటన నిర్వహించారు. ఉదయం 11.25 గంటలకు కర్నూలు విమానాశ్రయానికి చేరుకున్న సీఎం, అక్కడి నుంచి రోడ్డుమార్గంలో సీ క్యాంపు రైతు బజారుకు వెళ్లారు. రైతు బజారులో కూరగాయల వ్యర్థాలను ఎరువుగా మార్చే ప్రక్రియను పరిశీలించారు. పారిశుద్ధ్యంపై తీసుకుంటున్న చర్యలపై కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రైతులతో, పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖిగా మాట్లాడిన చంద్రబాబు, వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కేంద్రీయ విద్యాలయం సమీపంలోని జైరాజ్ స్టీల్ స్వచ్ఛాంధ్ర పార్క్‌కి శంకుస్థాపన చేసి, అక్కడి అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. తరువాత 12.55 గంటలకు కేంద్రీయ విద్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదికలో పాల్గొని స్థానికులతో మాట్లాడారు.
పీ 4 కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు రెండు బంగారు కుటుంబాల సభ్యులతో పాటు మార్గదర్శులతో కూడా ముచ్చటించారు. ప్రజావేదిక సభలో ప్రజలతో మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సమర్ధవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా నేతలకు పిలుపునిచ్చారు.
మధ్యాహ్నం 3.30 నుంచి 5 గంటల వరకు చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేలా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం సాయంత్రం 5.35 గంటలకు కర్నూలు విమానాశ్రయానికి చేరుకొని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు.









