సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదురైన తర్వాత అధికారాన్ని కోల్పోయిన వైఎస్సార్సీపీ నేటికీ ఆ పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆ ఓటమి అక్కసుతోనే రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు, హింసకు ప్రేరేపించే కుట్రలు పన్నుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం పార్టీ ముఖ్య నేతలు, సీనియర్ నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం, పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వైసీపీ తమను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోందని, ఉద్దేశపూర్వకంగా చట్టసవ్యస్థలను దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. గతంలో చేసిన తప్పులు, పాపాలను దారి మళ్లించేందుకే కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారని అన్నారు. అలాంటి కుట్రల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ చిక్కుకోకూడదని స్పష్టం చేశారు.
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చి అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన అజెండా అని సీఎం తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం వైసీపీ నేతలకు ఇష్టం లేక, దానిని అడ్డుకునేందుకు వివిధ రూపాల్లో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరినీ చట్టపరంగా శిక్షించడం తప్పదని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆవేశానికి లోనై చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. హింస, విధ్వంసం, అవినీతి అనే పునాదులపై నడిచే వైసీపీ ట్రాప్లో పడితే, వాళ్లకు మనకు తేడా ఏమీ ఉండదని హితవు పలికారు. కార్యకర్తలు సంయమనం పాటించేలా మంత్రులు, నేతలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.









