ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహించనున్న ‘యోగాంధ్ర’ అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లపై మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. సమావేశానికి ముందు సీఎం స్వయంగా ఆర్కే బీచ్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన అక్కడి అధికారులు, భద్రతా వ్యవస్థలతో మాట్లాడి అనేక కీలక సూచనలు చేశారు. అనంతరం సమీక్ష సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు, డీజీపీ హరీశ్‌గుప్తా తదితరులు హాజరై కార్యక్రమ ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు.
చంద్రబాబు మాట్లాడుతూ యోగా ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగం కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల సహకారంతో పాటు, ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ విధానాల్లో నిరంతర యోగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించేలా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. సుమారు 3.4 లక్షల మంది ఒకే వేదికపై యోగా చేయబోతుండటంతో ఇది ప్రపంచంలో అతిపెద్ద యోగా ఈవెంట్‌గా నిలిచే అవకాశముందని చెప్పారు.
పాల్గొనేవారికి అందుబాటులో అన్ని వసతులు ఉండేలా ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఎం వివరించారు. మొత్తం 34 బారికేడ్లు ఏర్పాటు చేసి, ప్రతి బారికేడ్‌లో వెయ్యి మందికి స్పష్టమైన మ్యాపింగ్ చేసినట్లు తెలిపారు. వాలంటీర్లు, యోగా కోచ్‌లు, వైద్య సిబ్బంది నియమించామని తెలిపారు. పారిశుద్ధ్యానికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ, ప్రతి 100 మందికి ఒక టాయిలెట్ ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. గతంలో వెయ్యి మందికి ఒకటిగా తెలియజేయడంలో పొరపాటు జరిగిందని ఆయన వివరణ ఇచ్చారు.
ఈ కార్యక్రమం ద్వారా 22 వేర్వేరు రికార్డులు సాధించేందుకు ప్రణాళిక సిద్ధమైందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లేదా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా వాహన సౌకర్యాలు, ప్రయాణ సమయాలపై ముందుగానే మార్గదర్శకాలు ఇచ్చినట్లు తెలిపారు. ముఖ్యంగా వర్షం వంటి అనుకోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.









