రాయలసీమ ప్రాంతానికి నీటిని అందించేందుకు కీలకంగా భావించబడే హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఈ మేరకు ప్రాజెక్టు పురోగతిని స్వయంగా పర్యవేక్షించేందుకు మే 9న అనంతపురం జిల్లా ఛాయాపురం గ్రామాన్ని సందర్శించనున్నారు.
టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ప్రాజెక్టుకు సంబంధించి ప్రధాన కాలువల లైనింగ్, వెడల్పు పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటికే పనులు వేగంగా కొనసాగుతుండగా, వచ్చే నెలలో ఫేజ్-1 పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో కాలువ నీటి సామర్థ్యం 2,200 క్యూసెక్కుల నుంచి 3,850 క్యూసెక్కులకు పెరగనుంది. ఈ పనులకు మొత్తం రూ.3,873 కోట్లు కేటాయించగా, ఇప్పటికే ఫేజ్-1లో రూ.696 కోట్లు, ఫేజ్-2లో రూ.1,256 కోట్లతో ప్రధాన పనులు జరుగుతున్నాయి.
టీడీపీ హయాంలో 2014–19 మధ్య కాలంలో ప్రాజెక్టుకు రూ.4,000 కోట్లకుపైగా వ్యయం జరిగింది. గొల్లపల్లి, మడకశిర, చెర్లోపల్లి, మారాల రిజర్వాయర్లను పూర్తి చేయడంతో పాటు, కియా వంటి ప్రముఖ పరిశ్రమలకు నీటిని అందించారు. ప్రస్తుతం పుంగనూరు బ్రాంచ్ కాలువ (75–207 కిలోమీటర్లు) రూ.480 కోట్లతో, కుప్పం బ్రాంచ్ కాలువ రూ.197 కోట్లతో నిర్మాణంలో ఉన్నాయి.
రేపటి సీఎం పర్యటన షెడ్యూల్ ప్రకారం, ఉదయం 9.30 గంటలకు ఉండవల్లి నుంచి బయలుదేరి, పుట్టపర్తి విమానాశ్రయం ద్వారా హెలికాప్టర్ లో ఛాయాపురం చేరుకుంటారు. అక్కడ ప్రాజెక్టును పరిశీలించి, ప్రజావేదిక సభలో మాట్లాడనున్నారు. అనంతరం బెంగళూరులో ‘ది హిందూ హడల్: ఇండియా ఇన్ డైలాగ్’ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ పర్యటన ద్వారా చంద్రబాబు ప్రాజెక్టుపై తన సంకల్పాన్ని మరింత పటిష్టంగా చాటనున్నారు.









