ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు (మే 21, 2025) కుప్పం పట్టణాన్ని సందర్శించనున్న నేపథ్యంలో, ఆయన పర్యటనను ముందుచూపుతో నిర్వహించేందుకు చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్. మణికంఠ చందోలు, ఐపీఎస్., ప్రత్యేక చర్యలు చేపట్టారు. కుప్పంలో జరుగుతున్న గంగమ్మ జాతరను పురస్కరించుకొని ఈ పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ నుండి గంగమ్మ ఆలయం వరకు కాన్వాయ్ ట్రయిల్ రన్ నిర్వహించారు.
ద్రవిడియన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుండి ప్రారంభమైన ట్రయిల్ రన్లో కాన్వాయ్ లో పాల్గొనబోయే డ్రైవర్లు, రోప్ పార్టీ, పైలట్ వాహన సిబ్బంది తదితరులకు విపులమైన దిశానిర్దేశం ఇచ్చారు. రోడ్ మీద ప్రతి వాహనం మధ్య తగిన గ్యాప్ ఉండేలా చూసుకోవాలని, పరిమిత వేగంతో ప్రయాణించాలన్న సూచనలు చేశారు. ఎలాంటి పొరపాటుకు తావివ్వకూడదని స్పష్టం చేశారు.
ప్రమాదకర పరిస్థితులు ఎదురైతే వాకీటాకీ ద్వారా వెంటనే సమాచారం ఇవ్వాలని, ముఖ్యమంత్రి వాహనం ఎక్కడ ఆగినా రోప్ పార్టీ అప్రమత్తంగా ఉండి ఆ ప్రదేశాన్ని భద్రత పరంగా కవర్ చేయాలని సూచించారు. పౌరులు సమీపంలోకి రాకుండా రోడ్ను తాత్కాలికంగా మూసివేయాలన్నది ఎస్పీ గారి స్పష్టమైన ఆదేశం. పైలట్ వాహనం ముందుగా వెళ్లి పరిస్థితులను అంచనా వేసి మార్గదర్శనం చేయాలని చెప్పారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు పోలీసు సిబ్బందికి, “మీరు అందరూ అత్యంత క్రమశిక్షణతో, సమన్వయంతో పనిచేయాలి. ముఖ్యమంత్రి గారి పర్యటనలో ఎలాంటి భద్రతా లోపాలు ఉండకూడదు. ఎవ్వరూ విధుల పట్ల అలసత్వం వహించకూడదు. ప్రతి ఒక్కరు తమ బాధ్యతను పూర్తిగా నిర్వర్తించాలి” అంటూ స్పష్టమైన సూచనలు చేశారు.









