విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం నుంచి పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గన్నవరం విమానాశ్రయం నుంచి హజ్‌కు వెళ్లే ప్రతి యాత్రికుడికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా హజ్ యాత్రకు వెళ్లే వారందరికీ ఈ సహాయం వర్తించనుంది.
విజయవాడ నుంచి హజ్‌కు వెళ్లే యాత్రికులపై విమాన చార్జీల భారం తగ్గించేందుకే ఈ ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దేశంలోని ఇతర ఎంబార్కేషన్ కేంద్రాలతో పోలిస్తే విమాన టికెట్ల ధర ఎక్కువగా ఉండటంతో యాత్రికులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
గన్నవరం విమానాశ్రయం పరిసర జిల్లాల యాత్రికులకు మరింత సౌకర్యం కల్పించడంతో పాటు, ఏపీ రాజధానిగా అమరావతి ప్రాముఖ్యతను పెంచే దిశగా కూడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విజయవాడను ప్రధాన ఎంబార్కేషన్ కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేసింది.
రాష్ట్రం నుంచి హజ్‌కు వెళ్లే యాత్రికులంతా విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ ఆర్థిక సహాయంతో యాత్రికులకు పెద్ద ఊరట లభిస్తుందని, హజ్ యాత్ర మరింత సులభంగా మారుతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై హజ్ యాత్రికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.









