అత్తింటి వేధింపులకు ఓ వైద్యురాలి బలి!

Dentist Pratyusha dies by suicide in Hasanparthy after alleged harassment by husband and in-laws. Police investigation underway.

హన్మకొండ జిల్లా హసన్‌పర్తిలో ఓ దంత వైద్యురాలికి అత్తింటి వేధింపులు ప్రాణాల మీదకు తెచ్చాయి. ములుగు జిల్లా మంగపేటకు చెందిన డాక్టర్ సృజన్‌తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైన వరంగల్‌కు చెందిన వైద్యురాలు ప్రత్యూష, గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో నివాసం ఉండి, గత ఏడాది హసన్‌పర్తిలో స్థిరపడ్డారు. ఇద్దరు కుమార్తెలు ఉన్న ఈ దంపతులు బయటకు చూసేంత వరకు సాధారణ కుటుంబంగా కనిపించగా, ఇంట్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉన్నట్టు తెలుస్తోంది.

సృజన్‌కు హన్మకొండకు చెందిన యువతితో వివాహేతర సంబంధం ఏర్పడినట్టు సమాచారం. దీంతో ప్రత్యూషపై అతని వ్యహారం మారిపోయి, మానసికంగా, శారీరకంగా వేధించసాగాడు. ఈ వేధింపులలో అత్తామామలు కూడా పాల్గొంటున్నారని తెలుస్తోంది. కోడలిని అన్యాయంగా వేధించడం, మాట్లాడకుండా చేయడం, ఒంటరిగా వదిలేయడం వంటి పనులు చేసేవారని ప్రత్యూష తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఈ వేధింపులు అధికమవడంతో ఆదివారం ప్రత్యూష తన భర్త ఇంట్లో ఉండగానే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లినా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. కానీ ప్రత్యూష శరీరంపై గాయాలున్నట్లు గుర్తించడంతో, ఇది కేవలం ఆత్మహత్య కాదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రత్యూష తల్లిదండ్రులు హసన్‌పర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెను హత్య చేసి, దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వారు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పూర్తి నిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మహిళల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తించాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share