ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏకంగా ఏడాది కాలంలోనే అభివృద్ధికి మార్గం చూపించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో నిర్వహించిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఊహించిన దానికంటే ముందే పనులు జరిగాయని, స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్యంగా తమ ప్రణాళికలన్నీ కొనసాగుతున్నాయని తెలిపారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తన అనుభవంతో సమర్థవంతమైన పాలన అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
గత వైసీపీ పాలనను టార్గెట్ చేస్తూ చంద్రబాబు విమర్శలు గుప్పించారు. మూడు రాజధానుల ప్రతిపాదన వల్ల రాష్ట్రానికి రాజధాని నిర్మాణంలో తీవ్ర ఆటంకం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, పెట్టుబడిదారుల్లో విశ్వాసం నశించిందని ఆరోపించారు. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం నిధుల దుర్వినియోగం, పరిపాలనలో స్పష్టత లేకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు.
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కీలక నిర్ణయాలు తీసుకున్నామని సీఎం తెలిపారు. మెగా డీఎస్సీ ప్రకటన, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, ఉచిత బస్సు ప్రయాణం, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. ‘తల్లికి వందనం’ పథకం ద్వారా విద్యార్థులకు ఆర్థిక ఉత్సాహం కల్పిస్తున్నామన్నారు. రైతులకు డ్రిప్ పరికరాలపై 90% సబ్సిడీ అందిస్తున్నామని పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.12,500 కోట్లు కేటాయించామని, అమరావతి నిర్మాణాన్ని మళ్లీ పట్టాలెక్కించామని చెప్పారు. మూడేళ్లలో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం చేయాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. 2047 నాటికి రాష్ట్ర తలసరి ఆదాయాన్ని రూ.2.6 లక్షల నుంచి రూ.55 లక్షల దాకా పెంచేందుకు ప్రభుత్వ దృష్టి పెట్టిందని, ఇది సాధించడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పని చేయాలని సూచించారు.









