పోలవరం వద్ద గోదావరి ఉగ్ర ప్రవాహం

Godavari swells at Polavaram due to heavy rains upstream; over 1 lakh cusecs released through 48 gates, submerging roads to Mahanandeeswara temple.

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది పోలవరం వద్ద ఉగ్ర రూపంలో ప్రవహిస్తోంది. వరద ప్రవాహం రోజు రోజుకు పెరుగుతుండటంతో పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిమట్టం గణనీయంగా పెరిగింది. ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద ఎగువ నీటిమట్టం 27.230 మీటర్లకు చేరగా, దిగువన 18 మీటర్లుగా నమోదైనట్టు అధికారులు తెలిపారు.

వరద ముప్పును దృష్టిలో ఉంచుకుని పోలవరం ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టులోని మొత్తం 48 గేట్లను ఎత్తి, స్పిల్‌వే ఛానెల్ ద్వారా 1,13,436 క్యూసెక్కుల మిగులు జలాలను గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. గోదావరిలో పెరుగుతున్న ప్రవాహం కారణంగా ప్రాజెక్టు పరిసర గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు.

మహానందీశ్వర స్వామి ఆలయానికి రాకపోకల కోసం నిర్మించిన రహదారి పూర్తిగా వరద నీటిలో మునిగిపోవడంతో భక్తులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ప్రవాహం తగ్గేంతవరకు ఆలయానికి రాకపోకలు స్ధగితమయ్యే అవకాశముందని అధికారులు స్పష్టం చేశారు.

అదేవిధంగా పోలవరం, గూటాల గ్రామాల మధ్య ఉన్న ఇసుక తిన్నెలు వరద నీటిలో క్రమంగా మునిగిపోతున్నాయి. అధికారులు వరద ప్రవాహంపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ పరిస్థితి చేజారకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే సహాయ చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share