పల్నాడు జిల్లా తంగెడ గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎల్లయ్య కుమారుడు హరికృష్ణపై దాచేపల్లి పోలీసుల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనపై పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ, ఇది రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీకి సంకేతమని ధ్వజమెత్తారు. ప్రజల్ని రక్షించాల్సిన పోలీసులే హింసకు పాల్పడడం దుర్మార్గమని ఆయన విమర్శించారు. ‘‘చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారాన్ని వీరికి ఎవరు ఇచ్చారు?’’ అంటూ ప్రశ్నించారు.
జగన్ అభియోగాల ప్రకారం, టీడీపీ నేత కారులో హరికృష్ణను పోలీసులు అక్రమంగా స్టేషన్‌కు తీసుకెళ్లి, తీవ్రంగా కొట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. అతన్ని సీఐ క్వార్టర్స్‌లో దాచిపెట్టారని, హరికృష్ణ తల్లిదండ్రులు, గ్రామస్తులు పోరాటం చేయకపోతే ఆయన పరిస్థితి ఏమై ఉండేదో తలచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ చర్యలు ఎవరి ఆదేశాలతో జరుగుతున్నాయి? ఎవరి అండతో ఇవి ముదిరుతున్నాయి? అని జగన్ నిలదీశారు.
ఇది రాజ్య హింసకు తార్కాణమని, పౌరులకు ఎలాంటి రక్షణ లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై ఇది ఓ అపహాస్యంగా నిలుస్తోందని, చట్టాన్ని, న్యాయాన్ని బేఖాతరు చేయడమేనని మండిపడ్డారు. ఈ చర్యలు పూర్తిగా నీతికి, నియమాలకు వ్యతిరేకంగా ఉన్నాయని జగన్ అన్నారు.
చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన జగన్, “రెడ్‌బుక్ రాజ్యాంగంలో మీరు శిశుపాలుడిలా పాపాలు చేస్తున్నారు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఇక మౌనంగా ఉండరని హెచ్చరించారు. ఈ దురాగతాన్ని అన్ని న్యాయ వ్యవస్థల దృష్టికి తీసుకెళ్లి, హరికృష్ణకు న్యాయం జరిగేంతవరకూ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలకు అనుబంధంగా జగన్ ఓ వీడియోను కూడా సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.









