సోనియా గాంధీ కేసులో కీలక మలుపు

భారత పౌరసత్వం పొందకముందే ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకున్నారనే ఆరోపణలతో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై కొనసాగుతున్న న్యాయ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోనియా గాంధీ పౌరసత్వం, ఓటరు జాబితాలో పేరు నమోదుకు సంబంధించిన అంశం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రస్తుతం కీలక దశకు చేరుకుంది. ఈ కేసు రాజకీయంగా, న్యాయపరంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
వివరాల్లోకి వెళితే, సోనియా గాంధీకి 1983లో భారత పౌరసత్వం లభించిందని, అయితే అంతకంటే మూడు సంవత్సరాల ముందే అంటే 1980లోనే ఆమె పేరును న్యూఢిల్లీ నియోజకవర్గం ఓటరు జాబితాలో అక్రమంగా చేర్చారని వికాస్ త్రిపాఠి అనే అడ్వకేట్ కోర్టును ఆశ్రయించారు. ఇది ఫోర్జరీ, మోసం, అలాగే ఎన్నికల చట్టాల ఉల్లంఘన కిందికి వస్తుందని పేర్కొంటూ క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆయన పిటిషన్‌లో కోరారు.
అయితే ఈ పిటిషన్‌ను తొలుత విచారించిన మెజిస్ట్రేట్ కోర్టు, తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ ఫిర్యాదును కొట్టివేసింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన పిటిషనర్, మెజిస్ట్రేట్ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రౌస్ అవెన్యూ సెషన్స్ కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు, దీనిపై స్పందించాలని కోరుతూ గత ఏడాది డిసెంబర్‌లో సోనియా గాంధీతో పాటు ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో శనివారం సోనియా గాంధీ తరఫు న్యాయవాదులు కోర్టులో తమ వివరణాత్మక సమాధానాన్ని (రిప్లై) దాఖలు చేశారు. గత విచారణలో సమాధానం ఇవ్వడానికి కొంత సమయం కోరిన నేపథ్యంలో, తాజాగా సమర్పించిన అఫిడవిట్‌ను కోర్టు రికార్డుల్లోకి తీసుకుంది. ఈ పరిణామంతో కేసు విచారణలో కీలక పురోగతి చోటు చేసుకున్నట్లుగా న్యాయ వర్గాలు భావిస్తున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share