కోవూరు నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. టీడీపీ మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. ఓ పార్టీ సమావేశంలో ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలు, దూషణలతో కూడిన మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో తీవ్ర స్పందన వచ్చింది. ఆయన వ్యాఖ్యలు మహిళా ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని ఆరోపిస్తూ మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఈ వివాదంపై స్పందించిన మహిళా సంఘాల నాయకులు, నాయకురాళ్లు రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. ప్రసన్న కుమార్ రెడ్డిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ స్పందిస్తూ, ఆయన వ్యాఖ్యలపై విచారణ చేపడతామని తెలిపారు. మహిళల పట్ల అసభ్య భాష వాడటం తక్షణమే ఆపాలని, రాజకీయాల్లో సానుభూతిని గెలుచుకునేందుకు కించపరిచే వ్యాఖ్యలు అనర్హమని ఆమె స్పష్టం చేశారు.
ఇటు నెటిజన్లు #YCPInsultsWomen అనే హ్యాష్‌ట్యాగ్ ద్వారా తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల నుంచి ఈ తరహా వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చేలా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. మహిళా నాయకులే కాదు, సామాన్య ప్రజలూ ఈ వ్యవహారంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో మహిళల పాత్రను తక్కువ చేసేందుకు చేసే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పలువురు హెచ్చరించారు.
ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ సోమవారం రాత్రి నెల్లూరులోని సావిత్రినగర్‌లో ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో ఇంటి అద్దాలు, ఫర్నీచర్, వాహనం ధ్వంసమయ్యాయి. దాడి జరిగిన సమయంలో ప్రసన్న కుమార్ ఇంట్లో లేకపోవడం అతనికి క్షేమంగా మారింది. వైసీపీ నేతలు ఘటనను ఖండించినా, ఈ దాడి వెనుక ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మద్దతుదారులే ఉన్నారని ఆరోపిస్తున్నారు. ఇదంతా రాజకీయ వివాదం మాటల యుద్ధం నుండి ప్రత్యక్ష దాడుల దాకా వెళ్లిన ఘట్టంగా మారింది.









