హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. క్లాస్ రూమ్‌లో విద్యార్థులకు బోధన చేస్తుండగానే ఓ లెక్చరర్ అకస్మాత్తుగా మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన సోమవారం కమలాపూర్‌లోని ఎంజెపి జూనియర్ కళాశాలలో జరిగింది. ఒక్కసారిగా జరిగిన ఈ సంఘటనతో కళాశాల వాతావరణం శోకసంద్రంగా మారింది.
స్థానిక ఎంజెపి జూనియర్ కళాశాలలో గత పది సంవత్సరాలుగా సివిక్స్ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్న నన్న బోయిన శ్రీశైలం తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో క్లాస్ రూమ్‌లోనే కుప్పకూలిపోయారు. వెంటనే సహ అధ్యాపకులు, సిబ్బంది ఆయనను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
శ్రీశైలం మృతి వార్త తెలియగానే విద్యార్థులు కన్నీటిపర్యంతమయ్యారు. క్రమశిక్షణకు, విద్యార్థులపై ప్రేమకు పేరుగాంచిన లెక్చరర్‌ను కోల్పోవడం తమకు తీరని లోటని సహ అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలో తరగతులను నిలిపివేసి సంతాప సభ నిర్వహించారు. ఈ ఘటనతో కళాశాల ప్రాంగణం అంతా మౌనంగా మారింది.
మృతుడు శ్రీశైలంకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యులు గుండెవిదారకంగా విలపించగా, స్థానికులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకుని సంతాపం తెలిపారు. విధి నిర్వహణలోనే ప్రాణాలు కోల్పోయిన శ్రీశైలం మృతి కమలాపూర్ మండలంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.









