ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్వాక్రా మహిళల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. జూన్ 1వ తేదీ నుంచి పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులకు రుణాలు అందించేందుకు ప్రత్యేకంగా మెప్మా లోన్ ఛార్జ్ క్రియేషన్ (MLCC) యాప్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ యాప్ ద్వారా బ్యాంకులు డైరెక్టుగా రుణాల సదుపాయాన్ని కల్పించనున్నాయి.
ఈ యాప్ ఉపయోగించడంతో మహిళలు తాము తీసుకున్న రుణాలకు సంబంధించి నెలవారీ వాయిదాలను నగదు రహితంగా చెల్లించవచ్చు. రుణ వాయిదా చెల్లించిన వెంటనే మొబైల్‌కు మెసేజ్ వచ్చి సమాచారం అందుతుంది. దీనివల్ల పారదర్శకత పెరగడమే కాకుండా, లావాదేవీలపై క్లియర్ ట్రాక్ ఉంటుందన్నది అధికారుల అభిప్రాయం.
ఇటీవలి కాలంలో వాయిదా చెల్లింపుల వ్యవహారంలో అనేక చోట్ల మోసాలు చోటుచేసుకున్న నేపథ్యంలో, ప్రభుత్వం ఈ డిజిటల్ యాప్ ద్వారా సమస్యలకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఇది బ్యాంకులకూ, మహిళలకూ సమర్థమైన వ్యవస్థగా ఉపయోగపడనుంది. డ్వాక్రా సంఘాల మహిళలు ఇకపై మధ్యవర్తుల లేకుండానే రుణ లావాదేవీలు చేయగలగడం ఇదివరకే ఉన్న సమస్యలకు పరిష్కారంగా నిలుస్తుంది.
ఇది కేవలం రుణ సౌకర్యం మాత్రమే కాకుండా, మహిళల ఆర్థిక సుస్థిరత దిశగా మరో ముందడుగు కూడా. స్త్రీనిధి వంటి కార్యక్రమాలకు మద్దతుగా రూపొందించిన ఈ యాప్ ద్వారా మహిళలు తమ హక్కులను వినియోగించుకుని, వ్యవస్థలో పూర్తి నమ్మకంతో ముందుకు సాగేందుకు దోహదపడుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం డిజిటల్ ఆర్థిక వ్యవస్థను గ్రామీణ, పట్టణ స్థాయిలో బలపరుస్తుందని విశ్లేషకుల అభిప్రాయం.









