ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతుండటంతో తీవ్ర చలి పరిస్థితులు నెలకొన్నాయి. పలుచోట్ల మంచు కురవడంతో ప్రజలు చలికి వణుకుతున్నారు. ఈ పరిస్థితుల ప్రభావం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతంపై కూడా తీవ్రంగా పడింది. ముఖ్యంగా అక్కడి గురుకుల, కేజీబీవీ విద్యార్థులు ఉదయం పూట చలిని తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హాస్టళ్లలో సరైన వసతులు లేకపోవడం విద్యార్థుల కష్టాలను మరింత పెంచుతోంది. చలిని తట్టుకునేందుకు అవసరమైన దుప్పట్లు, వెచ్చని దుస్తులు, ఇతర సౌకర్యాలు లేవని విద్యార్థులు వాపోయారు. చలి కారణంగా చదువుపై కూడా ప్రభావం పడుతోందని, ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వారు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
ఈ విషయం మంత్రి నారా లోకేశ్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. గురుకుల, కేజీబీవీ విద్యార్థులు ఎదుర్కొంటున్న అవస్థలు తన దృష్టికి వచ్చాయని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యమే తనకు తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేస్తూ, ఈ సమస్యను తక్షణమే పరిష్కరిస్తామని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.
పాడేరు ఏజెన్సీలో చదువుతున్న విద్యార్థులకు తగిన వసతులు వెంటనే కల్పించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌ను మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. శీతాకాలంలో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. మంత్రి స్పందనపై విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.









