ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేశారు. కానూరు సివిల్ సప్లై భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ ప్రజలను మోసం చేసేలా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. “రైతుల కోసం మీరు ఏం చేశారో చర్చకు సిద్ధమా?” అంటూ నేరుగా జగన్‌ను ప్రశ్నించారు. ప్రజలు ఐదేళ్లకు ఒకసారి అధికారం ఇస్తారన్న విషయాన్ని జగన్ మరిచిపోయారని ఎద్దేవా చేశారు.
గత ఐదేళ్ల పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచిన్న పనులు కూడా చేయలేకపోయిందని ఆయన విమర్శించారు. ముఖ్యంగా మద్యపాన నిషేధం, అమ్మ ఒడి వంటి హామీలను అమలు చేయలేకపోయారని గుర్తు చేశారు. దీనికి భిన్నంగా, కూటమి ప్రభుత్వం రైతులకు మద్దతుగా నిలుస్తున్నదని వివరించారు. తాము ఖరీఫ్, రబీ సీజన్లలో రూ.12,857 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. అందులో రూ.12,000 కోట్లు 24 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేయడం ప్రభుత్వ లక్ష్యాన్ని చూపుతుందని తెలిపారు.
జగన్ పాలనలో రూ.1,674 కోట్ల ధాన్య బకాయిలను రైతులకు ఇవ్వకుండా వదిలేశారని, గోదావరి జిల్లాలో క్రాఫ్ హాలిడే ప్రకటించి నరకం చూపించారని ఆరోపించారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికి గూగుల్ లేదా AI ఆధారంగా జగన్ కూడా పరిశీలించాలని మంత్రి సూచించారు. తమ ప్రభుత్వం రైతుల మద్దతుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
జగన్ రాష్ట్రానికి నెలలో ఒకసారి వచ్చి పర్యటనల పేరుతో రాజకీయ అలజడి సృష్టిస్తున్నారని మంత్రి విమర్శించారు. చిత్తూరు పర్యటనలో సామాజిక చీలికలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం మంచి పాలన, శాంతి భద్రతలు, అభివృద్ధి, సంక్షేమంతో ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులపై నిజమైన పురోగతి చూడబోతున్నారని చెప్పారు. “ఇది అద్భుతమైన పాలనకు నాంది,” అని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు.









